బుధవారం 18 నవంబర్ 2009

గాన కోకిల- సన్మానం VS అవమానం

పోయిన వారం మా టీ వీ వాళ్ళు ఆర్భాటంగా 75 వసంతాల గాన కోకిల అని సుశిల గారి పుట్టినరోజు పండుగ జరిపారు. దానిలో పెద్ద పెద్ద వాళ్ళూ/మహానుభావులు (అక్కినేని ఎండ్ కో, చిరంజీవీ ఎండ్ కో, మహా గాయని సునిత) వారితోపాటూ పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని చిన్న చిన్న చిల్లర కళాకారులు (అలనాటి గాయకులు వసంత, ఎల్.ఆర్.ఈశ్వరి, రావు బాలసరస్వతి, పీ.బీ. శ్రీనివాస్) వచ్చి తమ శక్తిమేరా సన్మాన సత్కారాలు చేసారు. ఇందులో అవమానం ఏముంది అంటే

అర్థ రూపాయి సింగర్ ల ని ఎక్కడి నుండి తెచ్చారో తెలియదు కానీ (కళాకారులు అనటానికి నిజంగా మనస్కరించటం లేదు, పాపము శమించుగాక) వాళ్ళ గొంతులతో కోకిలమ్మ పాటలని కాకి గోల లాగ/కారు కూతల్లాగా మార్చేసారు. అందులో ఒక విచిత్ర వ్యక్తి ఒకడు వచ్చాడు (పేరు గుర్తు లేదు/గుర్తు పెట్టుకోవాలి అని అనిపించలేదు), అసలు ఆ బిల్డప్ చూస్తే ఎస్.పీ నా ముందు వేస్టు అన్న ఫీలింగ్. జీవుడికి "ల" ఎక్కడ పలకాలో "ళ" ఎక్కడ పలకాలో అస్సలు తెలియదు,వత్తులైతే కాకెత్తుకుపోయింది, మచ్చుకి

"అందం హిందోళం, అదరం తాంబూళం "

"ఆకు చాటు పిందె తడిసె, కోక మాటు పిళ్ళ తడిసే" అబ్బ ఎంత అసహ్యం వేసిందంటే రామ రామ

ఇంక మహా నటి సునిత...ఎర్ర్ మహా గాయని సునిత "హంతేనా...ఒకటేనా" అని గారాలు పోతూ పాడుతూ ఉంటే, మనోడు రసిక రాజ శిఖామణిలా ఫీల్ ఐపోయి చిలిపి చూపులు (వెగటు చూపులు అని కూడా అనొచ్చేమో) చూస్తూ పంటి కింద పెదవి బిగించేసి "హెన్నైనా...హా హెన్నైనా"..హతోస్మి

ఈ ముదుర్ల కంటే చిన్న పిల్లలు చాల చక్కగా పాడారు అనిపించింది, కానీ ఎందుకో డైజెస్ట్ మాత్రం అవ్వలేదు అంత చక్కని పాటలని వీరు దారుణం గా కుళ్ళబొడవటం

ఈ కాకి గోల పక్కన పెడితే, ఆ కార్యక్రమాన్ని మొత్తం అక్కినేనీ ఎండ్ కో కోసమే నిర్వహించారా అని అనుమానం వచ్చింది. నిజానికి ఆవిడ సమకాలీనులైన గీతాంజలి, వసంత, ఎల్.ఆర్.ఈశ్వరి వంటి వారుండగా వారిని చీకట్లోకి తోసేసి కార్యక్రమం అంతా అక్కినేనీ ఎండ్ కో, చిరంజీవీ ఎండ్ కో మీద కెమెరా జూం చేసి ఇబ్బంది పెట్టేసారు, ఇంకా నయం ఎవరి ముహాల్లో ఎన్నెన్ని ముడతలు ఉన్నాయో సరిగా గెస్ చేసి ఎస్.ఎం.ఎస్ పంపని అడగలేదు..సంతోషం

చివరికి స్టేజ్ మీద కూడ వీరికిచ్చిన ప్రాముఖ్యత వారికి ఇవ్వకపోవటం భలే బాధ కలిగించింది, అంతేనేమో అంగ బలం అర్థ బలం లేకపోతే ఏనుగు కూడా తన విలువ కోల్పోతుందేమో. అక్కినేని కి పని తక్కువ, హడావిడి ఎక్కువ తనని తాను పెద్ద వక్తగా ఊహించేసుకుంటూ ప్రతి ప్రోగ్రాంలో ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటాడు. ఇక్కడ కూడా అలాంటి వెర్రి మొర్రి డవిలాగు ఏదో వదిలాదు "నాకు ఇక్కడ ఈవిడని చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది, నాతో నటించి ఎనభై రెండు మంది హీరోయిన్ లలో డెబ్భై ఐదు మందికి ఈవిడే పాడారు, వాళ్ళందరి హావభావాలు ఈవిడే పలికేసారు" అంటూ ఏమిటో అతకని మాటలు. చివరిలో మా టీవీ పెద్ద ఎవరో వచ్చి మేము కళాకారులకి పెద్ద పీట వేసేస్తున్నాము అంటూ వచ్చీ రాని డవిలాగులు నాలుగు వదిలాడు.

మొత్తానికి ఇది గానకోకిలకి సన్మానమో, అవమానమో మాత్రం నేను తేల్చుకోలేకపోయాను, ఏది ఏమైనా ఒక రఫీ, ఒక కిషోర్ కుమార్, ఒక యేసుదాస్, ఒక బాల సుబ్రమణ్యం, ఒక జానకి, ఒక సుశీల ఈ యుగానికి, అంతే, వీరికి డూపులు మాత్రం రారు, రాలేరు

సోమవారం 16 నవంబర్ 2009

ప్చ్..వైరాగ్యం

(మొన్న)

"ఏమిటోనండీ మూర్తి గారు, ఈ మధ్య ఆరోగ్యం బాగోటం లేదు, ఇంకా పిల్లకి పెళ్ళి చెయ్యాలి పిల్లాడి చదువు అవ్వలేదు ఎలా నెట్టుకొస్తానో అని భయం వేస్తోంది"

(నిన్న)

"నాన్నా, మమ్మల్ని విడిచి వెళ్ళద్దు నాన్నా" పాప ఏడుపు
"ఏవండీ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారేంటండీ" భార్య వేదన

(నేడు)

"ఎవరి సంసారాలు వదులుకుని ఎవరుంటారు" ఒక చుట్టం దెప్పిపొడుపు
"అందరికీ కాఫీ లు అందాయో లేదో చూడు" భార్య బాధ్యత

నిన్న మా పక్కింటాయన అకస్మాత్తుగా చనిపోయారు, పాపం పెద్ద వయసేమీ కాదు కానీ మృత్యు దేవతకి వయసుతో సంబంధం లేదు కదా. నిన్నటి నుండీ మనసు కలచి వేసినట్టుగా ఉంది, అంత వరకూ మా కళ్ళ ముందు తిరిగిన మనిషి అమ్మో నాకింకా బాధ్యతలున్నాయి వాటిని నెరవేర్చాలి అనుకుంటున్న మనిషి అలా ఉన్నట్టుండి పోయారు అంటే మనసు మహ వేదన పడింది, ఆ వేదనలో నుండి వైరాగ్యమో మరేదోనో పుట్టుకొచ్చింది

ఎంత సేపు నా వాళ్ళూ, నా డబ్బు, నా బాధ్యతలూ అంటూ ఒకటే తాపత్రయ పడిపోతాము, ఒక్క క్షణం కూడా ఎవరో రాసిన, దర్శకత్వం వహిస్తున్న నాటకంలో కేవలం పాత్రధారులమే మనకి తెలియని మలుపులెన్నో ఈ స్క్రిప్ట్ లో ఉంటాయి అన్న ఆలోచన కూడా రాని సామాన్య జీవులము. ఇంకా నేను పోషించాల్సిన పాత్ర చాలా ఉంది అని తెగ భ్రమ పడిపోతుండగా దర్శకుడు కట్ చెప్పెయ్యటమూ మన పాత్ర అంతటితో నాటకం నుండీ నిష్క్రమించటమూ ఐపోతుంది. అది ఎప్పుడు, ఎక్కడ ఎలా అన్నది తెలియకుండా భలే సస్పెన్స్ తో నడుస్తుంది కథ అంతా

మమకారాలున్నాయనో, బాధ్యతలున్నాయనో, బంధాలున్నాయనో వచ్చే ముగింపు రాక మానదు, మరెందుకో ఇంత ఉబలాటం. అలా అని నిమిత్తమాత్రులుగా ఉందాము అంటే అది కూడా సాధ్య పడదు. అలా ఉండగలిగితే తల్లి తన బిడ్డ అశుద్ధాన్ని చేత్తో ఎత్తదు, తండ్రి తన యవ్వనం మొత్తం తన సంసారం కోసం ధారపొయ్యడు. అలాగని మనతో పాటు వీరెవరైనా వచ్చేస్తారా అంటే అదీ లేదు. అదేంటో ఎప్పటిలాగానే తెల్లారుతుంది, ఆకలి వేస్తుంది, సాయంత్రం అవుతుంది, నిద్ర కూడా వచ్చేస్తుంది. కేవలం స్క్రీన్ మీద మనం మాత్రమే ఉండము కానీ మిగతా నాటకం అంతా అలానే జరుగుతుంది కదా. అందరూ ఒక వారమో, నెలో, యేడాదో తలుచుకుంటారు తర్వాత కాలం ఆ బాధని సమూలంగా తుడిచి పెట్టేస్తుంది.

మనకి మనం లేకపోవటమే అన్నిటికన్నా పెద్ద కష్టం, మిగతావన్నీ ఎలాగోలా తీర్చుకోగలిగే కష్టాలే, లేదా కొంత కాలం తర్వాత వాటంతట అవే తీరిపోయే కష్టాలే, ఇదేదీ కాకపోతే కాలం మరిపించేసే కష్టాలే (ఆత్మీయుల మరణం లాగ). కానీ మన జీవితంలో మూడొంతుల భాగం జరిగిపోయిన కాలంలో ని కష్టాలను తలుచుకుంటూనో, రాబోయే కాలంలో రాబోయే కష్టాలను ఊహించుకుంటూనో గడిపేస్తాము. ఇందులో నిజం గా మనిషిగా మనసు చంపుకోని మనిషిగా బ్రతికేది ఎన్ని రోజులు? రేపు దేవుడి దగ్గరకి వెళ్ళాక "ఇదిగో పెద్ద మనిషీ, నాకు నువ్విచ్చిన పనులన్నీ సక్రమంగా ధర్మం తప్పకుండా, నీతిని విడవకుండా, ఎవరినీ నొప్పించక్కుండా చక్కబెట్టుకుని వచ్చాను" అని చెప్పగలిగేలా ఒక్క క్షణం ఐనా జీవిస్తున్నామా?

ప్రపంచాన్ని ఉద్ధరించనవసరం లేదు, కనీసం మన చుట్టుపక్కల ఉన్నవారితో కలిసిమెలిసి సవ్యంగా జీవించగలుగుతున్నామా లేదా అన్నది ప్రశ్న. ఒక బలవంతునిగా (కులంలో నో, ధనంలో నో, విద్యలో నో, స్థాన బలిమితోనో, పదవీ బలంతోనో) బలహీనులని పీడించకుండా జీవిస్తున్నామా? ఒక తల్లిగానో/తండ్రిగానో పిల్లల మీద దాష్టికం చెలాయించకుండా జీవిస్తున్నామా? ఒక భార్యగానో/భర్తగానో జీవిత భాగస్వామిని వేధించకుండా జీవిస్తున్నామా? ఒక బిడ్డగా కన్నవారికి మానసిక వేదన కలిగించకుండా జీవిస్తున్నామా? స్నేహితులనో, ప్రేమికులనో నొప్పించకుండా జీవిస్తున్నామా? ఏమో నాకైతే శ్లేష్మంలో పడ్డ ఈగలాగ మన అపోహలతోనో, అసూయలతోనో, అనుమానాలతోనో ప్రతి క్షణం మన జీవితం నరకం చేసుకుంటూ అవతలి వారి జీవితాన్ని నరకం చేస్తూ బ్రతుకుతున్నాము అనే అనిపిస్తోంది.

నిజమే శుభం కార్డ్ పడేలోపల చేయవలసిన పనులు సంతృప్తిగా చేస్తూ, ప్రతి క్షణాన్నీ ఆనందంతో చిరునవ్వుతో ఆశ్వాదిస్తూ హంసలాగ బ్రతకగలిగితే అంతకన్నా సాకారమేముంది మానవ జీవితానికి.


అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనమ్
దేహాన్తే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వరః
"Fall is inevitable, but strive towards making it more elegant, dignified and less painful"

శుక్రవారం 23 అక్టోబర్ 2009

Familiarity breeds contempt


"Familiarity breeds contempt",ఎన్నో సార్లు విన్నా కానీ ఈ సామెత నాకెప్పుడూ అర్థం కాలేదు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్పించి. దేని మీద ఐనా పెరిగిన ఆకర్షణ కానీ, ఇష్టం కానీ అది దగ్గర అవుతున్న కొద్దీ, దాని గురించి మరింతగా తెలుసుకుంటున్న కొద్దీ తగ్గిపోతుంది అంటుంది ఈ వాక్యం. పున్నమి రేయి జాబిల్లిని చూసి మోహించని వాళ్ళ ఎంతమంది ఉంటారు, తీరా నాసా వాళ్ళు "దూరం నుండి ఇంత ఆకర్షించిన జాబిల్లి అసలు రూపం ఇది, అక్కడ అంతా మన్నూ మట్టీ, గుంతలూ కొండలూ తప్పితే ఏమీ లేదు" అనగానే కలిగే భావన ఇదేనేమో.

కొందరు వ్యక్తులూ, కొన్ని పరిచయాలు తొలుత వారిలో ఉన్న ఏదో ప్రత్యేకమైన అంశం వల్ల మనలో వారి మీద ఆరాధనా భావాన్ని కలిగిస్తుంది. ఒక రచయిత రచనలు కానీ, ఒక బ్లాగరు రాసే టపాలు కానీ, ఒక నటుడి నటనా కౌసల్యం కానీ, ఒక సహోద్యోగి/సహాధ్యాయీ యొక్క ప్రత్యేకమైన తెలివితేటలో, రూపమో మరేదో వారి పట్ల ఒకలాంటి ఆసక్తి ని పురిగొల్పుతుంది. వారితో పరిచయం పెంచుకుంటే బాగుండు అని మనసు ఒకటే తొందర పెడుతుంది. ఆ తర్వాతో?

నాకు నచ్చిన రచయిత మీద అంతే ఆరాధనతో ఎంతో ప్రయాస పడి కలుస్తాను, కానీ ఎన్నో ఆదర్శాలు వల్లించే ఆ రచయిత నిజ జీవితంలో ఒక పెద్ద వుమెనైజర్ అని తెలిస్తే? ఎంతో అద్భుతమైన టపాలు రాసే బ్లాగరుని ప్రత్యక్షంగా కలిసిన తర్వాత వారు బ్లాగులో చూపించే వ్యక్తిత్వానికీ వారి నిజ వ్యక్తిత్వానికీ పొంతనే లేదు అని తెలిస్తే? ఏదో ఒక ప్రత్యేకత ఉన్న సహాధ్యాయి/సహోద్యోగితో అతి కష్టం మీద స్నేహం చేసి ఉల్లి పొరలు వలిచినట్టు వారి గురించి కొంత కొంత తెలుసుకుంటుండగా వారి ప్రత్యేకతకీ వారి వ్యక్తిత్వానికీ ఏమాత్రం పొంతన కుదరటం లేదు అని తెలిసాక? సరే ఇవన్నీ శాశ్వత బంధాలు కాదు అని సరిపెట్టుకుందాము, కానీ ప్రేమ, పెళ్ళి వీటి సంగతేంటి?

ప్రేమ అంటేనే మనలోని లోపాలు కప్పిపుచ్చి మంచితనాన్ని ప్రదర్శించుకోవటం, పెళ్ళి అంటే ఆ వీళ్ళెక్కడికిపోతారులే అని ఎటువంటి ముసుగూ లేకుండా మన నిజరూపాన్ని బయటపెట్టటం. అటువంటప్పుడు ఈ వాక్యం ఎంత వరకూ నిజం అవుతుంది. నిజంగానే ఒక వ్యక్తికి దగ్గర అవుతున్న కొద్దీ వారి గురించి తెలుసుకుంటునా కొద్దీ వారి మీద ఏహ్యభావం కలుగుతుందా? అలా కలుగుతున్నా సరిపుచ్చుకుంటూ మనవాళ్ళే అనుకోవటమే మన బంధాలూ బాంధవ్యాలలోని గొప్పతనమా?

మనస్పూర్తిగా ప్రేమించిన వ్యక్తిలో మనకి తెలియని, మన మనసుకి నచ్చని కోణాలు బయటపడుతూ ఉంటే ఏమి చెయ్యగలము? అసలు ఇద్దరు వ్యక్తులు ఎంతకాలం కలిసి ఉంటే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తుంది? నచ్చటం లేదు అని అంతకాలం పెంచుకున్న బంధాన్ని తోసిరాజనగలమా? అలా కాదు అని సర్దుబాటు ఎంతవరకూ సాధ్యమవుతుంది? ఐనా మనుషులందరూ ఒకటే కదా, అందరిలోనూ ఒక ముసుగు వీరుడు దాక్కుని ఉంటాడు కదా, మరెందుకు మనం అవతలి వ్యక్తిలో ఏ లోపాలు లేని వ్యక్తిత్వాన్ని ఆశిస్తాము, ఎందుకు మన దృక్కోణంలో అవతలి వ్యక్తిని జడ్జ్ చేస్తాము, ఎందుకు ఈ జడ్జ్ మెంటల్ నేచర్ తో మన మనసుని పాడు చేసుకుంటూ ఎదుటివారి మనసుని పాడు చేస్తాము? ప్రతి మనిషికి తనని ప్రేమించే వారు దొరకాలి అనే ఉంటుంది, అలా ఎవరూ లేనప్పుడు జీవితం దుర్భరంగా, ఒంటరితనం మరణసమానంగా తోస్తూ ఉంటుంది. కానీ మనల్ని ప్రేమించే వారు దొరికితే ఆ ప్రేమని ఎంత వరకూ నిలబెట్టుకోగలము. నన్ను ప్రేమిస్తే సరిపోదు, నన్ను నన్నుగా ప్రేమించాలి అనే కండీషన్ పెడతాము, అసలే "Familiarity breeds contempt", అంటూంటే అలా మన గురించి అన్నీ తెలిసినా ప్రేమించేవాళ్ళు ఉన్నారంటే అది వరమే. కానీ అప్పటికి కూడా తృప్తి ఉండదు, నన్ను నన్నుగా ప్రేమిస్తే సరిపోదు నన్ను నాకు ఇష్టమైన విధంగా ప్రేమించాలి అంటాము, కాదా? "నాకు వెయ్యి రూపాయలు పెట్టి చీర కొంటేనే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు" అంటుంది ఒక లలన, ఏదో ఒక కారణం వల్ల అతను కొనలేదో యుద్ధానికి రంగం సిద్ధం. "నా మీద ప్రేమ ఉంటే ఈ రోజు నాకోసం సెలవు పెట్టి ఇంట్లో ఉండాలి" అంటాడో మగధీరుడు, ఏ కారణాల వల్ల ఐనా ఆ రోజు సెలవు పెట్టలేదో ఇంతే సంగతులు, అంతకాలం ఉన్న ప్రేమ అంతా క్షణాల్లో ఆవిరి అయిపోతుంది. ఏమో తనకి ఏమి కావాలో మనిషికి తెలిసే వరకూ తనలోని శూన్యాన్ని ఎవరూ పూడ్చలేరేమో, ఆ ఒంటరితనాన్ని పోగొట్టగలిగే తోడు ఎవరూ దొరకరేమో. ఏమో ఏమిటో ఈ మనసు గోల...
 

నేను-లక్ష్మి © 2008. Design By: SkinCorner